కార్మిక శక్తికి అండగా కేసీఆర్ ప్రభుత్వం : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

తెలంగాణ ప్రభ (పెద్దపల్లి): గత ప్రభుత్వాల హయాంలో  సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగ హక్కు కోల్పోయారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్  వారసత్వపు ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించి కార్మిక లోకానికి  దేవుడయ్యారని  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు. 

గురువారం ఆర్జీ-2 పరిధి, వకీల్ పల్లె బొగ్గు గనిపై  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  దశాబ్ది ప్రగతి యాత్ర జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వం  వారసత్వ ఉద్యోగ హక్కును  పోగొట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష 20 వేలుగా ఉన్న కార్మికులను 60 వేలకు కుదించారని  ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్   కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం  వారసత్వపు ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించి.. సింగరేణి కార్మికుల ఉనికిని  రక్షించారని ఆయన అన్నారు. దీంతో సుమారుగా 16వేల మంది యువత సింగరేణిలో  ఉద్యోగులుగా చేరారని అన్నారు. వారసత్వంతో  కార్మిక కుటుంబాల్లో ఆనందం వెళ్లివిరిసిందన్నారు.  టీబీజీకేఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత  నాయకత్వంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కార్మిక హక్కులను ఎన్నో సాధించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని మెప్పించి, ఒప్పించి రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశానన్నారు. ఈ కళాశాలతో స్థానిక నిరుపేద ప్రజానీకానికి ఉచితంగా కార్పొరేట్ వైద్యంతో పాటు  మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా  ఈ కళాశాల ఏర్పాటుతో  ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారుగా  వెయ్యి కుటుంబాలకు  జీవనోపాధి లభించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని  సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం.. ప్రతి ముఖంలో ఆనందం సీఎం కేసీఆర్ తో సాధ్యమైందన్నారు. ఐటీ శాఖమాత్యులు కేటీఆర్ సుమారుగా 15 లక్షల మందికి  జీవనోపాధి కల్పించారని అన్నారు. అదేవిధంగా కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యంతో పాటు  కార్మిక సమస్యలు సీఎం కెసిఆర్  సింగరేణి యాజమాన్యంతో  ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా  చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. 

60 ఏళ్లుగా  పాలించిన గత ప్రభుత్వాలు  ఏమి చేయకుండా  నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించాయని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన  దశాబ్ద కాలంలో  వందేళ్ల అభివృద్ధి సాధించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమం కేవలం తెలంగాణలోనే ఉండటం కెసిఆర్ గారికి ప్రజల పట్ల చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతుందనడంలో  అతిశయోక్తి లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపకల్పన చేస్తూ, పకడ్బందీగా  అమలు చేస్తున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేస్తున్నానని, స్థానిక ప్రజలకు శాశ్వత అభివృద్ధి ఫలాలు అందించే విధంగా  కార్యచరణలో ముందుకు సాగుతున్నానన్నారు. అందులో భాగంగానే  రామగుండం ప్రజానీక ఆరోగ్యం కోసం మెడికల్ కళాశాల, ప్రజలకు అవసరమైన రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సివిల్ వ్యాజ్యాల న్యాయం కోసం కోర్టు భవన సదుపాయం, యువతకు ఉపాధి కలిగించే విధంగా  ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్కు లాంటి అభివృద్ధి, తరతరాలుగా, శాశ్వతంగా ప్రజలకు సేవ చేసే కార్యాలయాలను ఏర్పాటుకు కృషి చేశానన్నారు. భారతదేశంలోనే ప్రజారంజక పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్ పై పలు పార్టీల నాయకులు కొంతమంది  దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ఏం చేసినా ప్రజలు నమ్మరని, సీఎం కేసీఆర్ కి అండగా నిలుస్తారన్నారు. సింగరేణి  కార్మికుల పక్షాన కెసిఆర్ ప్రభుత్వం  ఎల్లప్పుడు అండగా నిలుస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కి ఓటు వేసి రుణం తీర్చుకోవాలని, అదేవిధంగా హ్యాట్రిక్ సీఎంగా  కెసిఆర్ ని గెలిపించుకోవాలని  పిలుపునిచ్చారు. సింగరేణి కార్మిక అన్నలకు ఏ సమస్య వచ్చినా తాను వెన్నుదన్నుగా నిలుస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్  పాలనతో సంతృప్తి చెందిన పలువురు కార్మికులు ఎమ్మెల్యే సమక్షంలో టీబీజీకేఎస్ లో చేరారు. 

       ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీ-2  టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్  ఐలి శ్రీనివాస్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, ఐ. సత్యనారాయణ, మల్లికార్జున్, చంద్రయ్య, రాములు, దశరథం,  బాబురావు, సమ్మయ్య , రాకేష్, రామచంద్రారెడ్డితో పాటు కార్పొరేటర్లు  సాగంటి శంకర్, అడ్డాల గట్టయ్య, బిఆర్ఎస్ నాయకులు  మేడి సదానందం, ధరణి జలపతి, జనగామ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

.